Sunday, 18 October 2020

*కోదండ రామాలయం, తిరుపతి*

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-60*


🍁🍁🍁🍁🍁

*కోదండ రామాలయం, తిరుపతి*

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కోదండ రామాలయం ప్రాచీనమైన మరియు ప్రఖ్యాతమైన హిందూ దేవాలయం. ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఈ ఆలయం ఎదురుగా భక్తాంజనేయస్వామి వెలసియున్నారు.
భవిష్యోత్తర పురాణంలో శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమగుటకు శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించినట్లు చెప్పబడింది.

 ఆ కాలంలో ప్రస్తుతము ఆలయమున్న ప్రదేశంలో ఒక గుహ వెలసి ఉండేదని ప్రతీతి. అందుండి దివ్యమైన తేజస్సు వెలువడుతుండేది. రామాగమన గుర్తుగా ఈ ఆలయాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని తరువాతి కాలంలో జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిరని స్థానికుల అభిప్రాయము. ఈ ఆలయము లోని మూర్తులు 'రామచంద్ర పుష్కరిణి'లో చక్రవర్తికి లభించినట్లు భావిస్తున్నారు.
 
*కోదండ రామ స్వామి వారి రథం:*
గోవిందరాజస్వామి ఆలయంలోని కూరత్తాళ్వాన్ మండపం ఉత్తరగోడ లోపలి భాగంలో లభ్యమైన శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని శాలివాహన శకం 1402 (క్రీ.శ.1480) లో శఠగోపదాసర్ నరసింహ మొదలియార్, "నరసింహ ఉడయ్యార్" కాలంనాటి సంస్కృతి, సంప్రదాయాల చిహ్నంగా, రఘునాథుడు అనే పేరుతో శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్మించెనని తెలుస్తున్నది. శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ప్రకారం ఈ నరసింహ ఉడయ్యార్ గారే సాళువ నరసింహ రాయలు. 1830లో కాశీయాత్రకు బయలుదేరి దారిలో తిరుపతి ప్రాంతాన్ని దర్శించుకున్న ఏనుగుల వీరాస్వామయ్య అప్పటిలో ఆలయ స్థితిగతుల గురించి వ్రాశారు. 1830ల నాటికి రామస్వామి ఆలయానికి సర్కారు వారి కుమ్మక్కు (అధికారం) లేదని తెలిపారు. ఆలయం మొత్తంగా ఆచార్య పురుషుల చేతిలోనే ఉండేది 
ఈ ఆలయము ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించబడి తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలివుంటుంది. ఆలయపు శిల్పకళ విజయనగర కాలం నాటిదిగా గుర్తించవచ్చును. ప్రతి స్తంభంపై అనేక భాగవత, రామాయణ ఘట్టాలు, దేవతా మూర్తులు దర్శనమిస్తాయి.
శ్రీ కోదండస్వామి వారు, దక్షిణ భాగంలో సీతామహాలక్ష్మి, వామ భాగంలో లక్ష్మణస్వామి స్థానక భంగిమలో ఆర్చామూర్తులుగా వెలసి ఉన్నారు. ఇలా దక్షిణభాగంలో అమ్మవారు ఉండడం వైఖానస ఆగమశాస్త్ర నియమం. ఇలా కుడి ప్రక్కన అమ్మవారు ఉండేలా దర్శించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నమ్మకం.
 
*కోదండ రామ స్వామి వారి ఆలయ రాజ గోపురము*
గర్భగుడి ద్వారములు సువర్ణమయమై ముందుగా జయవిజయులు ద్వారపాలకులై సాక్షాత్కరిస్తారు. ఈ ఆలయంలో పంచబేరమూర్తులు ఉన్నారు. ఈఆలయ ప్రధాన గోపురమునకు ఎదురుగా కొంత దూరములో శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న గుడి ఉంది. దాని కెదురుగా ఆంజనేయ స్వామివారి స్తంభమున్నది.

శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏

🌸 *జై శ్రీమన్నారాయణ*🌸

Saturday, 19 September 2020

మహాలయ అమావాస్య నాడు పితృదేవతలు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు.

*మహాలయ అమావాస్య*

 తేదీ :  17/09/2020 
మహాలయ అమావాస్య నాడు పితృదేవతలు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. నిజానికి, ప్రతి మాసంలోను అమావాస్య, పితరుల పుణ్య తిథి గా భావించబడినా, మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షం లో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు.శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతం గా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణం లో చెప్పబడింది. ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మ లో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షం లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారం గా తెలుసుకోవచ్చు.

మహాలయ అమావాస్య రోజున కూరగాయలు దానం చేయండి*_

_*మహాలయ అమావాస్య రోజున కూరగాయలు దానం చేయండి*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్నసంతర్పణ , పితృశ్రాద్ధాలు నిర్వర్తించడం చేయవచ్చు. ఇప్పటి వరకు ఆ అలవాటు లేనివారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం , కూరగాయలు , ఉప్పు , పప్పు , పండ్లు దక్షిణ తాంబూలాదులతో విప్రులకు స్వయంపాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతోకాలంగా తీరని కోరికలు తప్పక నెరవేరతాయని విశ్వాసం.

ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణలు వదలడం , గతించిన పెద్దలను తలచుకుని వారి పేరిట అన్నదానం చేస్తే వారికి కడుపు , మనకు మనసు నిండుతాయి.

భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు బహుళ పక్షం పితృ దేవతా పూజకు విశిష్టమైనది. ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళ పక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు.

అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. పక్షం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ పితృ దేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలని పురోహితులు చెబుతున్నారు.

ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృ దేవతలు ఏ తిథినాడు మృతి చెందారో అదే తిథినాడు శ్రాద్ధం నిర్వహించాలి. తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షం నవమి తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ఈ పదిహేను రోజులూ నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి. లేకుంటే మహాలయ అమావాస్య రోజున మాత్రం శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు.

ఉత్తరాయణం దేవతల కాలం గనుక ఉత్తమ కాలమని , దక్షిణాయనం పితృకాలం గనుక అశుభమని పూర్వీకుల విశ్వాసం. అంతేకాక ఆషాఢంలో వచ్చే కర్కటక సంక్రమణ నుంచే ప్రారంభమయ్యే దక్షిణాయనం వానలు , బురద , చిమ్మచీకటితో భయంకరమవుతుంది. అశుభమనిపిస్తే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.

అందులో భాద్రపద మాసమంతా జలమయంగా కనిపిస్తుంది. ఇదే ఒక మహా వినాశనం అనుకోవడంలో ఆశ్చర్యం అంతకంటే లేదు. కావున ఈ పక్షంలో అందరికీ శ్రాద్ధ తర్పణములు చేయాలని శ్రాద్ధాలతో వారిని సంతృప్తి పరిస్తే తమకు ప్రళయం గడుస్తుందని భావించి ఉండవచ్చు. అంతేకాక ఆషాఢం రెండవ పక్షం మొదలు ఐదవ పక్షం వరకు పితురులు చాలా కష్టపడుతుంటారు. కాబట్టి మహాలయ పక్షంలో ప్రతిరోజూ శ్రాద్ధం జరపాలని ఆచారంగా పెట్టారు.

పితురులను తృప్తి పరచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇది. స్వర్గుస్తులైన మాతాపితురుల కోసం ప్రతీవారు ఈ పక్షాలలో పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సు పొందగలుగుతారు. భాద్రపద పాడ్యమితో అరంభమైన పితృపక్షం , మహాలయ పక్షమం అమావాస్యతో ముగుస్తుంది.

Wednesday, 27 May 2020

‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు)

 ‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు)  - 
‘సేక్రెడ్‌ ఫుడ్స్‌ ఆఫ్‌ గాడ్‌’....తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు

  తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి... చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు. మరి... వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా? ఇవి మాత్రమే కాదు... ఏడుకొండల వాడికి పూట పూటకూ ఒక మెనూ! రుతువులను బట్టి ఆహారం! స్వామి వారికి సకల విధమైన నైవేద్యం! అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ వివరాలతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు) అనే పుస్తకం రాశారు. దాని తొలి ప్రతిని ఆయన అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అందించారు. ఏడు కొండల వాడి దివ్య ప్రసాదాలపై పుస్తకంలోని విశేషాలను రమణ దీక్షితులు ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

 ఆ వివరాలు మీకోసం ప్రత్యేకం...

సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు వినియోగించరు. ప్రసాదం వండేవారు వంట సమయంలోగానీ, తర్వాతగానీ వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక... శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ దానిని చూడకూడదు.

 

నేవైద్యం పెట్టేది ఇలా...

ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు. గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు. స్వామి, ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు. విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు. కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. (స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట.) పవిత్ర మంత్రాలు ఉచ్ఛరిస్తూ అన్నసూక్తం నిర్వర్తిస్తారు. చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే. ఈ విధంగా స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధగుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు.

 

నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు. రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు. పది, పదకొండు గంటల మధ్య రాజభోగం, రాత్రి ఏడు - ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు. తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు. నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు. ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.

 

ఉదయం బాలభోగం

    మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి

మధ్యాహ్నం రాజభోగం

    శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం

రాత్రి శయనభోగం

    మరీచ్యఅన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం(వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం)

అల్పాహారాలు

    లడ్డు, వడ, అప్పం, దోసె

స్వామి మెనూ ఇదీ...

ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగు తేలే ఆవుపాలు సమర్పిస్తారు. తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు. ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది. సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి... స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు! అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గూడాన్నం) పెడతారు. ఇక పవళించే సమయం దగ్గరపడుతుంది. ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేంచిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.

 

ఇదీ ‘ప్రసాదం’

బియ్యం, ధాన్యాలు, ఆవు పాల పదార్థాలు, ఔషధ గుణాలున్న వస్తువులు, వనస్పతులు, లవంగాలు, యాలకులు, తులసి, మిరియాలు... ఇవన్నీ శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోస్తారు. హింసలేని ప్రపంచాన్ని కోరుకున్న మహర్షులు నిర్దేశించిన ప్రసాదాలు ఇవి! ప్రసాదం అంటే ఆకలి తీర్చే ఆహారం కాదు! పవిత్రంగా పరిమితంగా స్వీకరించవలసిన పదార్థం. ఈ అంశాలను భక్తజనానికి వివరించడమే ఈ పుస్తక పరమోద్దేశం! ‘సేక్రెడ్‌ ఫుడ్స్‌ ఆఫ్‌ గాడ్‌’ పుస్తకాన్ని రాయడానికి నాకు రెండేళ్ల సమయం పట్టింది.

 

నా అనుభవాలన్నిటినీ ఇందులో రాశాను. ఈ పుస్తకంపై వచ్చే రాయల్టీని తిరుమలలోని అన్నప్రసాద పథకానికి ఇవ్వాలని సంకల్పించాను. ఈ పుస్తకాన్ని చూడగానే రాష్ట్రపతి అభినందించారు. ప్రపంచంలోని శ్రీవారి భక్తులందరికీ అర్థమవ్వాలనే తొలిగా ఆంగ్లంలో విడుదల చేశాం. త్వరలో తెలుగు, తమిళం, హిందీ, ఇతర భాషల్లో విడుదల చేయటానికి ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థ అయిన పెంగ్విన్‌ శ్రీవారి వైభవాన్ని తెలిపేలా పుస్తకాలను రాయమని కోరారు. స్వామి ఉత్తర్వులే అనుకుని రాయటానికి ఒప్పుకున్నాను.

- *రమణ దీక్షితులు, టీటీడీ ప్రధానార్చకుడు*
 Detional information by www.saisaranam.in

Friday, 15 May 2020

పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం "పితృ దోషం' ..

పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం "
పితృ దోషం' ...
మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ...
అలాగే... 
తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.
మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.
అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు -
 మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే.
అదే
" పితృ దోషం "
ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం.
అందుకే ఈ పోస్టు పెడుతున్నాను.
పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.
ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.
వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.
పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...
చిన్న వారు అకాలమరణం పొందడం 
శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.
అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం మన ప్రమేయం లేకుండా
ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం
మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం
ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం
దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.
స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే ...
అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.
1. కాశీ
2. పాపనాశి  ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)
అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.
విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .
అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం -
స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....
పాలు అన్నముతో చేసిన పాయసం,
అన్నము, ముద్దపప్పు, నేయి,
వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని  స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు . 
స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.
ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును ) 
అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ  స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.
ఈ ఆలయ ప్రాముఖ్యము మా గురువు గారు అయిన తంత్ర గురు "భరణి స్వామి " ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !
ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని గ్రూపులో పెట్టడం జరిగింది !
చేరుకొనే విధానం :
అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "
ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశిశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి !
ఈ ఆలయ విశేషాల గురించి ' స్మశాన నారాయణుడి పూజ గురించి సంప్రదించవలసిన ఆలయ పూజారి నంబర్లు :
9182883807,
7995464344.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ పోస్టు కింద  కామెంట్ లో పెట్టగలరు '
నాకు తెలిసినది చెప్పగలను !
పదిమందికి ఉపయోగపడే విషయం . దయవుంచి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి
సర్వేజనా సుఖినోభవంతు
శ్రీ గురుభ్యోన్నమః

Saturday, 9 May 2020

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన_చక్రం ఎవరూ తయారుచేసినది కాదు....

భద్రాచలం 
శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం గర్భగుడిపై 
ఉన్న సుదర్శన_చక్రం ఎవరూ తయారుచేసినది కాదు....
*****************************************

మరి అది ఎలా వచ్చిందంటే....??
భక్తరామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను రప్పించి వారిచేత సుదర్శన చక్రాన్ని తయారచేయిస్తున్నాడు.కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో,లేదా సరిగా రాకపోవడమో జరుగుతుంది.కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై "భక్తా..!! సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు.అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు" అని చెప్పాడు.మరుసటి రోజు గజ ఈతగాళ్ళతో రామదాసు వెతికించాడు.కానీ కనిపించలేదు.మళ్లీ రాముడు కలలో కనిపించి "అది నామీద అమితమైన భక్తిని పెంచుుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది" అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రునికి స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది.ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది......
ఇంతటి ప్రాశస్త్యం ఉన్నది కనుకనే భద్రాద్రి మహా పుణ్యక్షేత్రమై విలసిల్లుతుంది....
#జై_శ్రీమన్నారాయణ....

Friday, 8 May 2020

కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి నిజరూప

*💐కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి నిజరూప దర్శనం💐*

మహా ప్రళయంలో భక్తులను రక్షించిన కరవీరపుర మహా లక్ష్మీ అమ్మవారు 

శ్రీ మహాలక్ష్మీ (అంబాబాయి)  దేవాలయం భారతదేశం లోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కొల్హాపూర్ లో శక్తి పీఠం. ఇది హిందూ పురాణాల ప్రకారం శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది.

*ఆలయ విశేషాలు*

పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.మహాలక్ష్మిని ప్రేమగా అంబా బాయి అనికూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా, కొల్హాపూర్, భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది.7 వ శతాబ్దం లోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరన్దేవ్ తిరిగి చాలాకాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8 వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది.నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ కి తండోపతండాలుగా వస్తారు. ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతో, సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది.

ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ, 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మీ కొలువై ఉంటుంది. 3 అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మీ ప్రతిమను చెక్కడం జరిగింది. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంది. దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది. కిరీటంపై విష్ణువు తల్పం అయిన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది. ఆమె నాలుగు చేతులలో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి. కుడివైపు క్రింది చేతిలో మాలుంగ (సిట్రస్ జాతి ఫలం), ఎడమవైపు కింది చేతిలో పాత్ర ఉంటుంది. హిందూ పవిత్ర చిత్రాలలో ముఖం ఉత్తరవైపు లేదా తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది. ఈ దేవతా విగ్రహం పశ్చిమవైపు చూసే విధంగా ఉంటుంది. చిన్న తెరిచిఉన్న కిటికీ పశ్చిమవైపు గోడకు ఉంటుంది. సూర్యాస్తమయం అయినపుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం 21 మార్చి మరియు 21 సెప్టెంబరు లలో మూడురోజులపాటు విగ్రహంపై పడతాయి. ఆలయ పరిసరాల్లో నవగ్రహాల, సూర్యుని, మహిసాసుర మర్థని, విఠల్-రఖ్‌మయి, శివుడు, విష్ణువు, తుల్జా భవాని మరియు యితర విగ్రహాలు ఉంటాయి. వీటిలోకొన్ని విగ్రహాలు 11వ శతాబ్దానికి ముందువి కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి. ఆలయం వద్ద మణికర్ణికా కుండం అనే కొలను ఉంది. ఆ కొలను ఒడ్దున విశ్వేశ్వర మహాదేవ్ విగ్రహం ఉంది.

అమ్మవారికి రోజూ అయిదు సార్లు అర్చన జరుగుతుంది .ఉదయం అయిదు గంటలకు శ్రీ మహా లక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ  హారతి ఇస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ, శేజ్ హారతి జరుపుతారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు.

*నిర్మాణ శైలి*

మహాలక్ష్మి దేవాలయం 'హేమాడ్ పంతి' నిర్మాణశైలిలో కట్టబడింది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం వుంది. గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. 

మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కి.మీ. దూరంలో ఉన్నతెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది.

*పూర్వకథ*

అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట.

శివుని ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది. అమ్మవారు వెలసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురమనే పేరు సార్థకమైంది. ఈ నగరాన్ని కోల్‌పూర్ అని కోల్‌గిరి అని, కొలదిగిరి పట్టణ్ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే ‘లోయ’అని, ‘పూర్’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వికులు పాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమానమైందని తెలుస్తోంది.

సూర్యగ్రహణం రోజు స్నానం చేస్తే
ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా, నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా, శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా, మూడున్నర కోట్ల తీర్థాలూ సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని కరవీర నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని స్తుతించారని పద్మ, స్కాంద, దేవీభాగవతాలు ప్రస్తావించాయి.

పూజలు, ఉత్సవాలు: అమ్మవారికి రోజూ అయిదు సార్లు అర్చన జరుగుతుంది .ఉదయం అయిదు గంటలకు శ్రీ మహా లక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ  హారతి ఇస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ, శేజ్ హారతి జరుపుతారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు

*విశేషాలు*

 మహారాష్ట్రలో వడాపావ్, పావ్ మిశాల్ ప్రసిధ్ధిచెందిన వంటకాలు. అక్కడవుండగా వాటి రుచి చూడండి. ఆలయ ప్రాగణంలో వున్న షాపుల్లో మహారాష్ట్రియన్ స్టైల్ లోని ఆర్టిఫిషియల్ నగలు చూడండి. బయట షాపుల్లో వెండివస్తువుల్లో మంచి డిజైన్లు దొరుకుతాయంటారు. కొల్హాపూర్ చెప్పులకి ప్రసిధ్ధి. కొల్హాపూర్ గురించి ఇంకో విశేషం ఏమిటంటే దేశంలో మొట్టమొదటి చలన చిత్రం రాజా హరిశ్చంద్ర ఇక్కడే తయారైంది.

*వాతావరణం*

 ఇక్కడి వాతావరణం సాధారణంగా చల్లగానే వుంటుంది. శీతాకాలం మరింత ఆహ్లాదంగా వుంటుంది. ఈ నగరాన్ని వానాకాలంలో తప్ప,  ఎప్పుడైనా సందర్శించవచ్చు.

*దర్శనీయ స్ధలాలు*

 మహారాజ భవనం సుమారు రెండు వందల గదులతో మూడు అంతస్థులతో విశాలమైన మైదానం మధ్యలో ఉంటుంది. ఆనాటి రాజుల ఆయుధాలు, రాజరికపు సామగ్రి మొదలైనవి ఇందులో పొందుపరిచారు.దత్తాత్రేయుడి రెండవ అవతారం నృసింహ సరస్వతి ఇక్కడికి 60 కి.మీ. ల దూరంలో వున్న కృష్ణ, పంచగంగల సంగమ క్షేత్రమయిన నర్సోబావాడిలో కొన్ని సంవత్సారాలు నివసించి తపస్సు చేసుకున్నారు. అక్కడ వారి పాదుకల మందిరం వున్నది. సమీపంలో వున్న పన్హాలా కొండలపై శివాజీ కోట, జ్యోతిబా మందిరం ప్రసిధ్ధి చెందినవి. దీనికి కొల్హాపూర్ నుంచి ఆటోలో కూడా వెళ్ళిరావచ్చు. దోవలో పంచగంగ నదిని చూడవచ్చు.

*రవాణా సౌకర్యం*

హైదరాబాదునుంచి 540 కిలోమీటర్ల దూరంలో వున్న కొల్హాపూర్ కి బస్సు, రైలు రవాణా సౌకర్యాలు వున్నాయి.

వసతి సౌకర్యం: కొల్హాపూర్ పెద్ద వూరు. వసతి, భోజన సదుపాయాలకి ఇబ్బంది లేదు.

*ఓం శ్రీ మహా లక్ష్మీ నమోస్తుతే*

*కోదండ రామాలయం, తిరుపతి*

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-60* 🍁🍁🍁🍁🍁 *కోదండ రామాలయం, తిరుపతి* ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కోదండ రామాలయం ప్రాచీన...