జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి

*ర్యాలి* :

ప్రకృతి మాత ముద్దుబిడ్డ కోనసీమ అందాన్ని చూసి పరవశించిపోవడం మన వంతైతే జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఏకంగా స్థాణువయ్యాడట. ఇక్కడ తలలో పువ్వు పోగొట్టుకున్న జగన్మోహిని, బదిలీ కోరిన భక్తుల కోర్కెను ఇట్టే తీరుస్తుందని భక్తుల విశ్వాసం.  చెరొక చోట ఉద్యోగం చేసే భార్యాభర్తలను ఒక చోటికి చేర్చడంలో ఈదైవంచూపే కారుణ్యం కొనియాడదగినది.  ఈ అరుదైన యాత్రాస్థలం మన రాష్ట్రంలోనే గోదావరి గట్టున ఉంది.

ఎక్కడ ఉంది?
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది. ఈ ప్రాంతాన్ని కోనసీమ అంటారు. నిండైన కొబ్బరి చెట్లకు కోనసీమ ప్రసిద్ధి. ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. గోదావరి ఉపనదులు ఇక్కడ ప్రవహించడంవల్ల ఈ ప్రాంతం సాక్షాత్తూ 'అన్నపూర్ణ'. ర్యాలిలో జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. ఇది ఏకశిలా విగ్రహం. ఇటువంటి శిలను సాలగ్రామ శిల అంటారు. ఈ విగ్రహం పొడవు ఐదు అడుగులు. వెడల్పు మూడు అడుగులు. విగ్రహానికి ముందువైపు విష్ణుమూర్తి, వెనుకవైపు జగన్మోహిని. ఇటువంటి విచిత్రమైన దేవాలయం మరెక్కడా లేదేమో? నల్లరాతి శిల్పం కావడం వల్ల ఈ విగ్రహం కంటికింపుగా ఉంటుంది. ఇందులోని శిల్ప సౌందర్యం వర్ణనాతీతం. నఖశిఖ పర్యంతం అందంగా ఉంది అని చెప్పడానికి ఇది నిజమైన నిదర్శనం. కాలి గోళ్ళు, చేతి గోళ్ళు నిజంగా ఉన్నాయా? అనిపించేలా అద్భుతంగా మలిచాడు శిల్పి. అదేవిధంగా 'శిఖ' జుట్టు వెంట్రుకలు చెక్కిన తీరు చూస్తే ఇది శిల్పమా, నిజంగా జుట్టు ఉందా? అనిపించేలా, చెక్కిన శిల్పి నిజంగా ధన్యుడే,!. ఈ విగ్రహం పాదాల దగ్గర నుంచి, నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది.అది 'విష్ణు పాదోధ్బవియైన గంగ' అనే ఆధ్యాత్మిక నమ్మకం. ఆమాట పక్కన పెడితే,, శిలల్లో 'జలశిల' అనే దాన్నుంచి నీరు నిరంతరం విష్ణుమూర్తి పాదాలను కడుగుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం. గుడిప్రాంగణమంతా దశావతారాలకి సంబంధించిన శిల్పాలు కొలువై ఉన్నాయి.

ఎప్పుడు నిర్మించారు?
ర్యాలి ప్రాంతం 11వ శతాబ్ది సమయంలో పూర్తిగా అరణ్యం. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళ చక్రవర్తి రాజా విక్రమ దేవుడు, ఈ ఆలయాన్ని నిర్మించాడు. తరువాతి రోజులలో దీనిని పునరుద్ధరించారు.

ఎలా చేరుకోవాలి?
ర్యాలిని దర్శించడానికి ఉత్తర భారతంనుంచి వచ్చే యాత్రికులు విశాఖపట్నం మీదుగా (ఐదవ నెంబర్‌ జాతీయ రహదారి)తుని, అన్నవరం, రాజమండ్రి చేరుకోవాలి. రాజమండ్రి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా వెళ్ళి, బొబ్బర్లంక దగ్గర ఎడమవైపు తిరగాలి. బొబ్బర్లంక మీదనుంచి లొల్లమీదుగా మెర్లపాలెం దగ్గర కుడివైపుకి తిరిగితే ర్యాలి చేరుకుంటాం.

విజయవాడ వైపు నుంచి వచ్చేవారు రావులపాలెం (ఐదవ నెంబర్‌ జాతీయ రహదారి), దగ్గర కుడివైపుగా తిరిగి మెట్లపాలెం దగ్గర ఎడమవైపు తిరిగితే ర్యాలి చేరుకోవచ్చు.

ర్యాలి ప్రాధాన్యత!

గోదావరి జిల్లా ప్రాంతంలో(రాలి-అంటేపడిపోవటం.అదేమార్పుచెంది 'ర్యాలి' గామారింది. '. ఈ ప్రాంతాన్ని పూర్వం 'రత్నపురి' అని పిలిచేవారు. భాగవత కధ ప్రకారం... దేవతలు, దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. వాసుకి అనే పాముని తాడుగా, మంధర గిరిని కవ్వంగా చేసుకుని, తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు నిలబడి సముద్రాన్ని చిలికారు. అందులోంచి చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి, విషం... ఇలా వరుసగా వచ్చిన తరువాత చిట్టచివరకు ధన్వంతరి అమృతకలశంతో ప్రత్యక్షమయ్యాడు. దేవదానవులిరువురూ దాని కోసం పోటీ పడుతుండగా, విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో వచ్చి, అమృతం దానవులకి అందకుండా దేవతలకు మాత్రమే అందజేసి ముందుకు నడుస్తుండగా, వెనుకనుంచి విష్ణువుని చూసి జగన్మోహినిగా భ్రమచెందిన శివుడు విష్ణుమూర్తి చెయ్యిపట్టుకోగానే ఉలికిపాటుతో విష్ణువు వెనుకకు తిరిగాడు. ఆ సమయంలో సిగలోంచి ఒక పువ్వు రాలిపడింది. ఆ కారణంగా ఆప్రాంతానికి 'ర్యాలి' అని పేరు వచ్చిందని స్థలపురాణం. విష్ణువుని చూసిన శివుడు స్థాణువులా నిలబడిపోయాడని అందుకే శివాలయం, వైష్ణవాలయం ఎదురెదురుగా ఉంటాయని స్థానికులు చెప్తారు. అలా వెనుకకు తిరిగిన విష్ణుమూర్తి ముందువైపు పురుషుడిగానూ, వెనుక జగన్మోహిని రూపంలోనూ ఉంటాడు.

తిక్కన చెప్పినట్లు ఇక్కడ హరిహరనాధ తత్వం కనిపిస్తుంది. విష్ణుమూర్తి జగన్మోహినీకేశవస్వామిగాను, శివుడు ఉమాకమండలేశ్వరుడుగాను భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠచేసేటపుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలంతో మంత్ర పూతం కావించాడని స్థలపురాణం. అదే విధంగా జగన్మోహినీకేశవస్వామి విగ్రహాన్ని కూడా మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించారని చెబుతారు. గుడిలోని పూజారులు నూనె దీపం సహాయంతో విగ్రహం గురించి వివరిస్తూ అణువణువూ చూపిస్తారు. నల్లరాతి విగ్రహాన్ని దీపం సహాయంతో చూస్తే విగ్రహం అందం రెట్టింపవుతుంది.

సందర్శన వేళలు
ఉదయం ఆరు నుంచి పన్నెండు వరకు, తిరిగి మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఎనిమిది వరకు. లోపల ఫోటోలు తీయడానికి అంగీకరించరు.
ర్యాలి చాలా చిన్న గ్రామం, అందువల్ల రావులపాలెం నుంచే ఆహారపదార్ధాలు తీసుకెళ్ళడం మంచిది.

ర్యాలి వెళ్ళడానికి ప్రత్యేకమైన ప్యాకేజీలు లేవు. రాజమండ్రి అతిదగ్గరి రైల్వేస్టేషన్‌. మధురపూడి(రాజమండ్రి దగ్గర) అతి దగ్గరి విమానాశ్రయం. రావులపాలెం దాకా బస్సులు దొరుకుతాయి. అక్కడి నుండి ఆటోలు గాని, టాక్సీల ద్వారాగాని ర్యాలి చేరుకోవాలి. పట్టణాలలో  వాహనాలమీద తిరిగి విసుగెత్తిన వారికి గుర్రపుబండి ప్రయాణం చాలా సరదాగా ఉంటుంది. గుర్రపు డెక్కల చప్పుడు, రోడ్డుకిరువైపులా పచ్చని పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణం, దారిలో చిన్న చిన్న పిల్లలు వీడ్కోలు పలుకుతూ టాటా చెప్పడం, ఇలాంటి అనుభూతుల్ని మనం సొంతం చేసుకోవచ్చు.

బదిలీ కావాలనుకున్నవారు ఈ దేవుణ్ణి సందర్శిస్తే తమ కార్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.

ర్యాలి సందర్శనంతో పాటు వాడపల్లి వెంకటేశ్వర స్వామిని, పంచారామాలలోని నాలుగు ఆరామాలు సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం కూడ కలుపుకోవచ్చు. అలాగే పక్కనే ఉన్న అంతర్వేది, కోటిపల్లి, ధవళేశ్వరం బ్యారేజి, రాజమండ్రిలోని మార్కండేశ్వర స్వామి గుడి, కోటి లింగాలరేవు, సారంగధర మెట్ట కూడ కలుపుకుంటే గోదావరి నదీతీర ప్రాంతంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాన్ని చూసినవాళ్ళం అవుతాం.

                           స్వస్తి!

Comments

Popular posts from this blog

18-11-21 or 19/11/21- పౌర్ణమి తిధి నిర్ణయం-సంశయ నివృత్తి*ఈసారి కార్తీక పౌర్ణమి తిధి 18వ తేదీ మధ్యాహ్నం 12.01 నిమిషాల నుండి మరుసటి రోజు అంటే 19వ తేదీ మధ్యాహ్నం 2.27 నిమిషాలు వరకు

*కోదండ రామాలయం, తిరుపతి*

మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ - ఎలా తుడుచుపెట్టుకు పోతాయో ఒకసారి పరిశీలి ద్దాం…!* కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు