Friday, 19 April 2019

శ్రీ కృష్ణ జాంబవంతుల యుద్ధం, శ్రీరామచంద్రమూర్తి దర్శనం

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
   ☆శ్రీకృష్ణుడి నిందావిమోచన క్షేత్రం☆
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

శ్రీకృష్ణ జాంబవంతుల యుద్ధం, శ్రీరామచంద్రమూర్తి దర్శనం... పురాణాల్లోని ఆసక్తికర ఘట్టాలు. ఆ ఐతిహ్యానికి సాక్ష్యంగా నిలిచినచోటే నెల్లూరు జిల్లాలోని మన్నారుపోలూరు. ఇక్కడ శ్రీకృష్ణుడు జాంబవతీ సత్యభామా సమేతంగా వెలిశాడు.

రామభక్తుడైన జాంబవంతుడికి స్వామితో యుద్ధం చేయాలనే విచిత్రమైన కోరిక కలిగిందట. ఆ రోజు వస్తుందని స్వామి ఆయన్ను ఆశీర్వదించాడు కూడా. అమిత పరాక్రమశాలి అయిన జాంబవంతుడిని ద్వంద్వ యుద్ధంలో ఓడించే శక్తి ఒక్క శ్రీరామచంద్రుడికి తప్ప మరెవరికీ ఉండదు. ద్వాపరయుగంలో గుహల్లో ఉంటున్న జాంబవంతుడిని సాక్షాత్‌ రామచంద్రమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణపరమాత్మ చేరి యుద్ధం చేస్తాడు. తన నీలాపనిందను పోగొట్టుకోవడానికి స్వామి యుద్ధం చేసే ఘటన శమంతకమణోపాఖ్యానంలో మనకు కనిపిస్తుంది. రామచంద్రమూర్తి దర్శనమివ్వబోతున్నాడన్న వార్త విని ఆంజనేయుడూ ఆ చోటుకి వచ్చాడట. ఈ కథనం జరిగిన స్థలమే మన్నారుపోలూరు అని ప్రసిద్ధి. మణిమండప క్షేత్రంగా ప్రసిద్ధిచెందిన సత్యభామా జాంబవతీ సమేత అళఘు మల్లారి కృష్ణస్వామి ఆలయం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలంలోని మన్నారుపోలూరు గ్రామంలో ఉంది. ఇక్కడే జాంబవంతునికి కోదండరాముడై దర్శనం ఇచ్చినందువల్ల ఈ క్షేత్రానికి మణి మండప క్షేత్రమని పేరొచ్చింది. జాంబవంతుడితో స్వామి మల్లయుద్ధం చేసినందున స్వామిని మల్లహరి అని పిలిచారట. ఆ మల్లహరి మల్లారిగా మారి తరువాత ‘మన్నారుపోలూరు’గా ఆ గ్రామం పేరు స్థిరపడింది. వైష్ణవ భక్తాగ్రేసరులైన పన్నిద్దరాళ్వార్లు స్తుతించిన 108 దివ్య తిరుపతులలో ఈ మణిమంటప క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం పూర్వం దండకారణ్యంలో భాగంగా ఉండేదని చెబుతారు. బ్రహ్మ కాంచీపురంలో యాగమాచరించేప్పుడు దండకారణ్య ప్రాంతపు ఉత్తర ఈశాన్యపు సరిహద్దును నిర్ణయించుకునేందుకు దీనిని చిహ్నంగా పెట్టుకొన్నాడంటారు. అందుకు గుర్తుగా కాళంగి నదీ ప్రాంతం నుంచి శ్రీకాళహస్తి ప్రాంతపు తొట్టంబేడు తిప్పలు వరకు ఒక ఎత్తైన కట్ట అగడ్తవలె ఉండేదట. దీనినే కోటకట్ట అని ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. ఇది నేడు శిథిలమై కనిపిస్తోంది. బహుశా ఇదే బ్రహ్మయాగం నాటి ఉత్తర ఈశాన్యపు సరిహద్దుగా ఉండవచ్చనీ, ఇక్కడే గోమహర్షి తపస్సు చేసి వైకుంఠ ప్రాప్తి పొందాడనీ చెబుతారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ ఆలయంలో ఏటా శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి పర్వదినాలు విశేషంగా జరుగుతాయని ఆలయ అర్చకులు వల్లీపురం చక్రవర్తి మురళీకృష్ణన్‌ చెప్పారు.
స్థల పురాణం
సత్రాజిత్తు దగ్గర ఉన్న శమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగిలించాడన్న నిందను నివృత్తి చేసుకోవడానికి కృష్ణుడు తన సైన్యంతో అడవులకు వెళతాడు. అక్కడ కనిపించిన సింహపు జాడలను బట్టి ఓ గుహలో ప్రవేశించి లోపల ఓ ఎలుగుబంటి దగ్గర మణి ఉండటాన్ని గమనించి జాంబవంతునితో 28 రోజులు యుద్ధం చేస్తాడు. చివరకు కృష్ణుడిని శ్రీరాముడిగా గుర్తించడటం, జాంబవంతుడు తన కూతురు జాంబవతినీ, శమంతకమణినీ స్వామికి ఇవ్వడం జరుగుతాయి. దాన్ని సత్రాజిత్తుకు ఇవ్వడం ద్వారా స్వామి నిందావిముక్తుడయ్యాడు. ఆ యుద్ధం జరిగిన చోటు ఇదే అవడం వల్ల ఈ క్షేత్రాన్ని నిందావిమోచన క్షేత్రంగా పిలుస్తారు. సాక్షాత్తూ జాంబవంతుడే ఇక్కడ మూలవిరాట్టులను ప్రతిష్ఠించాడని చెబుతారు. జాంబవంతుడే క్షేత్రపాలకుడిగా ఉండటం మరో విశేషం. బ్రహ్మాండపురాణంలో క్షేత్ర ప్రశస్తి విస్తృతంగా ఉంది.
పదో శతాబ్దం నుంచీ...
ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. చోళ రాజుల శిల్ప కళా వైభవాన్ని ఇక్కడ చూడొచ్చు. మనుమసిద్ధి హయాంలో, వెంకటగిరి రాజుల కాలంలో ఆలయం వైభవోపేతంగా ఉంది. వెంకటగిరి పాలకులు, దేవాలయానికి 5 గ్రామాలను విరాళంగా ఇచ్చారు. భారత ప్రాచీన శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన భూగృహం ఒకటి దేవాలయ ప్రాంగణంలో బయట పడింది. సౌందర్యవళ్లి అనేపేరుతో వెలసిన రుక్మిణీదేవి ఆలయం ప్రధానాలయానికి దక్షిణ భాగంలో ఉంది. ఒకప్పుడు గరుత్మంతుడు తన కంటే బలవంతుడు ఎవరూలేరని లోలోపల గర్వపడుతూ ఉండేవాడట. అది గమనించిన స్వామి గరుడుడి గర్వమణచదలిచి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఆంజనేయుడిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పాడు. స్వామి ఆజ్ఞమేరకు హిమాలయానికి వెళ్లి ఆంజనేయస్వామి తపస్సుకు భంగం కలిగించడంతో కోపోద్రిక్తుడైన ఆంజనేయుడు గరుడుడిని చెంప దెబ్బ కొట్టాడు. నొప్పికి తాళలేక గరుడుడు ఏడుస్తూ దీనంగా స్వామితో మొరపెట్టుకుంటున్నట్లుగా, ఒక చెంప వాచి ఉన్న గరుడుడి విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. మళ్లీ స్వామి ఆజ్ఞమేరకు గరుడుడు పోయి ఆంజనేయుడితో ‘స్వామి కోదండరామస్వామిగా జాంబవంతుడికి దర్శనమిస్తున్నాడు రమ్మ’ని పిలువమనగా అది విన్న ఆంజనేయుడు సంతోషంగా వెంటనే వచ్చి దాసాంజనేయుడై ఉన్న విగ్రహమూ మనకు కనిపిస్తుంది. దీన్ని గర్వభంగ క్షేత్రమనీ పిలుస్తారు.
మరిన్ని విశేషాలు
ద్వారపాలకులైన జయవిజయులతో పాటూ విష్వక్సేన, సుగ్రీవుల బొమ్మలూ, రావణుడు నరకడం వల్ల ఒకరెక్కేఉన్న జఠాయువు, శ్రీనివాస మూర్తులను ఇక్కడ చూడవచ్చు. ఆలయంలో స్వామి సన్నిధిన ఆళ్వార్లతో పాటూ 9.5 అడుగుల ఎత్తుతో కన్నీరు కారుస్తూ కన్పించే గరుత్మంతుని విగ్రహం, అదే ఎత్తులో ఉన్న జాంబవంతుని విగ్రహాలూ ఆకట్టుకుంటాయి. ఆలయ గోపురం మీద తిరుమల గోపురంలోలా సింహాల బొమ్మలు ఉంటాయి.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
               వేదాంతం కిరణ్ కుమార్
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

108 Names of Lord Rama & Meanings

Here is the Sri Ram Ashtothram (108 Names of Lord Rama) along with their meanings: 1–20 1. Om Ramaya Namah – Salutations to Sri ...