Tuesday, 28 April 2020

ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మ

*ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మ 

తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అని ఒక మహాతల్లి ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆవిడ ధృతి, దీక్ష ఎంత గోప్పవంటే - ఆవిడ జీవితములో ఒకేఒక్కసారి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికని బయలుదేరారు. బయలుదేరి, గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చునారు, బోయీలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే, పెద్దవాళ్ళు "ఒక్క అరగంట లో గన్నవరం వెళ్లీపోతాం... అక్కడ సీతమ్మ గారు మనకు అన్నం పెడతారు" అని మాట్లాడుకోవటం విన్నారు సీతమ్మగారు. వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి, పల్లకి వెనక్కి తిప్పెయ్యండి... వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. అంతటి నిరతాన్న దాత ఆవిడ.

ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే, అందరికీ పెట్టి పెట్టి, ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది. ఒకానొకప్పుడు ఆవిడ భార్తగారు "ఎందుకు ఇంకా ఈ అన్నదానం? మనకి కూడా తినటానికి ఏమీ లేదు. వచ్చి ఎవరైనా తలుపుకొడితే సిగ్గేస్తోంది! పెట్టడమా మానవు! ఇంత అన్నం పప్పైనా పెడతావు..." అన్నారు. దానికి ఆవిడ "నేను నిస్వార్థముగా పెట్టేటప్పుడు, వచ్చిన వారు తింటున్నప్పుడూ వచ్చినదీ, తింటున్నదీ శ్రీ మహా విష్ణువని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు? మనకీ వాడే పెడతాడు" అని చెప్పి పెట్టింది. ఇన్నాళ్ళ నుంచీ దున్నుతున్న అదే పొలానికి వెళ్లి సీతమ్మ గారి భర్త ఒక రోజు సాయంకాలం గొయ్యి తవ్వుతున్నారు. గునపానికి ఏదో తగిలి ఖంగుమంది. ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే, దాని నిండా బంగారు నాణాలే. తీసుకొచ్చి ఇంట్లో బంగారు కాసుల రాశులు పోసి, మళ్లీ రొజూ కొన్ని వందల మందికి అన్నదానం చేసారు.

ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలక్టరుకి డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని ఉత్తరం వ్రాసాడు. దేనికి అంటే "నాకు పట్టాభిషేకము జరిగేటప్పుడు ఆవిడకు నమస్కారం పెట్టాలి. కానీ ఆవిడ సముద్రము దాటి రారు కాబట్టి, ఆ సమయములో ఒక సోఫా వేసి, ఆవిడ ఫోటో అందులో పెట్టి, ఆవిడకు నమస్కారము పెట్టి అప్పుడు పట్టాభిషేకము చేసుకుంటా" అని వ్రాసాడు. తూర్పు గోదావరి జిల్లా కలక్టరు గారు ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, "నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. విష్ణు మూర్తికి అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు పట్టభిషేకలు ఎందుకు, వద్దు" అన్నారు ఆవిడ. "అమ్మ ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు" అని ఆ కలక్టరు గారు చెబితే, "నీ ఉద్యోగం పోతుంది అంటే, తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి" అని తీయించుకున్నారు ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్థముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ది కోసం పాటుపడితే, వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం....🙏

జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి

*ర్యాలి* :

ప్రకృతి మాత ముద్దుబిడ్డ కోనసీమ అందాన్ని చూసి పరవశించిపోవడం మన వంతైతే జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఏకంగా స్థాణువయ్యాడట. ఇక్కడ తలలో పువ్వు పోగొట్టుకున్న జగన్మోహిని, బదిలీ కోరిన భక్తుల కోర్కెను ఇట్టే తీరుస్తుందని భక్తుల విశ్వాసం.  చెరొక చోట ఉద్యోగం చేసే భార్యాభర్తలను ఒక చోటికి చేర్చడంలో ఈదైవంచూపే కారుణ్యం కొనియాడదగినది.  ఈ అరుదైన యాత్రాస్థలం మన రాష్ట్రంలోనే గోదావరి గట్టున ఉంది.

ఎక్కడ ఉంది?
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది. ఈ ప్రాంతాన్ని కోనసీమ అంటారు. నిండైన కొబ్బరి చెట్లకు కోనసీమ ప్రసిద్ధి. ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. గోదావరి ఉపనదులు ఇక్కడ ప్రవహించడంవల్ల ఈ ప్రాంతం సాక్షాత్తూ 'అన్నపూర్ణ'. ర్యాలిలో జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. ఇది ఏకశిలా విగ్రహం. ఇటువంటి శిలను సాలగ్రామ శిల అంటారు. ఈ విగ్రహం పొడవు ఐదు అడుగులు. వెడల్పు మూడు అడుగులు. విగ్రహానికి ముందువైపు విష్ణుమూర్తి, వెనుకవైపు జగన్మోహిని. ఇటువంటి విచిత్రమైన దేవాలయం మరెక్కడా లేదేమో? నల్లరాతి శిల్పం కావడం వల్ల ఈ విగ్రహం కంటికింపుగా ఉంటుంది. ఇందులోని శిల్ప సౌందర్యం వర్ణనాతీతం. నఖశిఖ పర్యంతం అందంగా ఉంది అని చెప్పడానికి ఇది నిజమైన నిదర్శనం. కాలి గోళ్ళు, చేతి గోళ్ళు నిజంగా ఉన్నాయా? అనిపించేలా అద్భుతంగా మలిచాడు శిల్పి. అదేవిధంగా 'శిఖ' జుట్టు వెంట్రుకలు చెక్కిన తీరు చూస్తే ఇది శిల్పమా, నిజంగా జుట్టు ఉందా? అనిపించేలా, చెక్కిన శిల్పి నిజంగా ధన్యుడే,!. ఈ విగ్రహం పాదాల దగ్గర నుంచి, నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది.అది 'విష్ణు పాదోధ్బవియైన గంగ' అనే ఆధ్యాత్మిక నమ్మకం. ఆమాట పక్కన పెడితే,, శిలల్లో 'జలశిల' అనే దాన్నుంచి నీరు నిరంతరం విష్ణుమూర్తి పాదాలను కడుగుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం. గుడిప్రాంగణమంతా దశావతారాలకి సంబంధించిన శిల్పాలు కొలువై ఉన్నాయి.

ఎప్పుడు నిర్మించారు?
ర్యాలి ప్రాంతం 11వ శతాబ్ది సమయంలో పూర్తిగా అరణ్యం. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళ చక్రవర్తి రాజా విక్రమ దేవుడు, ఈ ఆలయాన్ని నిర్మించాడు. తరువాతి రోజులలో దీనిని పునరుద్ధరించారు.

ఎలా చేరుకోవాలి?
ర్యాలిని దర్శించడానికి ఉత్తర భారతంనుంచి వచ్చే యాత్రికులు విశాఖపట్నం మీదుగా (ఐదవ నెంబర్‌ జాతీయ రహదారి)తుని, అన్నవరం, రాజమండ్రి చేరుకోవాలి. రాజమండ్రి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా వెళ్ళి, బొబ్బర్లంక దగ్గర ఎడమవైపు తిరగాలి. బొబ్బర్లంక మీదనుంచి లొల్లమీదుగా మెర్లపాలెం దగ్గర కుడివైపుకి తిరిగితే ర్యాలి చేరుకుంటాం.

విజయవాడ వైపు నుంచి వచ్చేవారు రావులపాలెం (ఐదవ నెంబర్‌ జాతీయ రహదారి), దగ్గర కుడివైపుగా తిరిగి మెట్లపాలెం దగ్గర ఎడమవైపు తిరిగితే ర్యాలి చేరుకోవచ్చు.

ర్యాలి ప్రాధాన్యత!

గోదావరి జిల్లా ప్రాంతంలో(రాలి-అంటేపడిపోవటం.అదేమార్పుచెంది 'ర్యాలి' గామారింది. '. ఈ ప్రాంతాన్ని పూర్వం 'రత్నపురి' అని పిలిచేవారు. భాగవత కధ ప్రకారం... దేవతలు, దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. వాసుకి అనే పాముని తాడుగా, మంధర గిరిని కవ్వంగా చేసుకుని, తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు నిలబడి సముద్రాన్ని చిలికారు. అందులోంచి చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి, విషం... ఇలా వరుసగా వచ్చిన తరువాత చిట్టచివరకు ధన్వంతరి అమృతకలశంతో ప్రత్యక్షమయ్యాడు. దేవదానవులిరువురూ దాని కోసం పోటీ పడుతుండగా, విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో వచ్చి, అమృతం దానవులకి అందకుండా దేవతలకు మాత్రమే అందజేసి ముందుకు నడుస్తుండగా, వెనుకనుంచి విష్ణువుని చూసి జగన్మోహినిగా భ్రమచెందిన శివుడు విష్ణుమూర్తి చెయ్యిపట్టుకోగానే ఉలికిపాటుతో విష్ణువు వెనుకకు తిరిగాడు. ఆ సమయంలో సిగలోంచి ఒక పువ్వు రాలిపడింది. ఆ కారణంగా ఆప్రాంతానికి 'ర్యాలి' అని పేరు వచ్చిందని స్థలపురాణం. విష్ణువుని చూసిన శివుడు స్థాణువులా నిలబడిపోయాడని అందుకే శివాలయం, వైష్ణవాలయం ఎదురెదురుగా ఉంటాయని స్థానికులు చెప్తారు. అలా వెనుకకు తిరిగిన విష్ణుమూర్తి ముందువైపు పురుషుడిగానూ, వెనుక జగన్మోహిని రూపంలోనూ ఉంటాడు.

తిక్కన చెప్పినట్లు ఇక్కడ హరిహరనాధ తత్వం కనిపిస్తుంది. విష్ణుమూర్తి జగన్మోహినీకేశవస్వామిగాను, శివుడు ఉమాకమండలేశ్వరుడుగాను భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠచేసేటపుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలంతో మంత్ర పూతం కావించాడని స్థలపురాణం. అదే విధంగా జగన్మోహినీకేశవస్వామి విగ్రహాన్ని కూడా మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించారని చెబుతారు. గుడిలోని పూజారులు నూనె దీపం సహాయంతో విగ్రహం గురించి వివరిస్తూ అణువణువూ చూపిస్తారు. నల్లరాతి విగ్రహాన్ని దీపం సహాయంతో చూస్తే విగ్రహం అందం రెట్టింపవుతుంది.

సందర్శన వేళలు
ఉదయం ఆరు నుంచి పన్నెండు వరకు, తిరిగి మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఎనిమిది వరకు. లోపల ఫోటోలు తీయడానికి అంగీకరించరు.
ర్యాలి చాలా చిన్న గ్రామం, అందువల్ల రావులపాలెం నుంచే ఆహారపదార్ధాలు తీసుకెళ్ళడం మంచిది.

ర్యాలి వెళ్ళడానికి ప్రత్యేకమైన ప్యాకేజీలు లేవు. రాజమండ్రి అతిదగ్గరి రైల్వేస్టేషన్‌. మధురపూడి(రాజమండ్రి దగ్గర) అతి దగ్గరి విమానాశ్రయం. రావులపాలెం దాకా బస్సులు దొరుకుతాయి. అక్కడి నుండి ఆటోలు గాని, టాక్సీల ద్వారాగాని ర్యాలి చేరుకోవాలి. పట్టణాలలో  వాహనాలమీద తిరిగి విసుగెత్తిన వారికి గుర్రపుబండి ప్రయాణం చాలా సరదాగా ఉంటుంది. గుర్రపు డెక్కల చప్పుడు, రోడ్డుకిరువైపులా పచ్చని పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణం, దారిలో చిన్న చిన్న పిల్లలు వీడ్కోలు పలుకుతూ టాటా చెప్పడం, ఇలాంటి అనుభూతుల్ని మనం సొంతం చేసుకోవచ్చు.

బదిలీ కావాలనుకున్నవారు ఈ దేవుణ్ణి సందర్శిస్తే తమ కార్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.

ర్యాలి సందర్శనంతో పాటు వాడపల్లి వెంకటేశ్వర స్వామిని, పంచారామాలలోని నాలుగు ఆరామాలు సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం కూడ కలుపుకోవచ్చు. అలాగే పక్కనే ఉన్న అంతర్వేది, కోటిపల్లి, ధవళేశ్వరం బ్యారేజి, రాజమండ్రిలోని మార్కండేశ్వర స్వామి గుడి, కోటి లింగాలరేవు, సారంగధర మెట్ట కూడ కలుపుకుంటే గోదావరి నదీతీర ప్రాంతంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాన్ని చూసినవాళ్ళం అవుతాం.

                           స్వస్తి!

Monday, 27 April 2020

శ్రీ రామానుజాచార్య జీవిత చరిత్ర*_

_*28 - 4 2020
శ్రీ రామానుజాచార్య  జయంతి
🕉 నారాయణయ నమహా
శ్రీ రామానుజాచార్య జీవిత చరిత్ర*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీ రామానుజ జయంతి మంగళవారం 28 ఏప్రిల్ 2020 శ్రీ రామానుజచార్య జయంతి :   శ్రీ రామానుజచార్య తిరువతిరై నక్షత్రం 1004 వ జన్మదినం ప్రారంభమవుతుంది = 12:29 AM 28-ఏప్రిల్ -2020 తిరువతీరై నక్షత్రం…

రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి.

*జన్మ స్థలం, నక్షత్రం మరియు ఇతర వివరాలు :-

ఆయన క్రీస్తు శకం 1017 సంవత్సరంలో శ్రీపెరంబుదూరుగా ఇప్పుడు పేరున్న భూతపురిలో జన్మించారు. శ్రీపెరంబుదూరు చెన్నై పట్టణానికి సుమారు పాతిక కిలో విూటర్ల దూరంలో ఉంది. కలియుగం 4118 సంవత్సరం, శాలివాహన శకం ప్రకారం 1004 వ సంవత్సరం అవుతుంది. ఆయన జనన కాలానికి, కుటుంబానికీ సంబంధించిన ఇతర వివరాలు : పింగళ నామ సంవత్సరం, చైత్ర మాసం. శుక్లపక్షం పంచమి తిథి, బృహస్పతి వారం, ఆర్ద్రా నక్షత్రం, కర్కాటక లగ్నం. ఆయన తల్లి కాంతమతి, తండ్రి కేశవా చార్యులు. హరీత గోత్రం. ఆపస్తంబ సూత్ర యజుశ్శాఖా ధ్యాయులు. తండ్రి వద్దా, కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్దా ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి. గురువు తోనే భేదించి తన విశిష్టాద్వైత వాదాన్ని నెగ్గించుకొన్న ప్రతిభాశాలి. ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉంది. దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత. విద్యాభ్యాస కాలానికి విశిష్టాద్వైతం ఒక సిద్ధాంతంగా ఆయన విశ్వాసాలను తీర్చిదిద్దలేదు. ఆయనకు సహజంగా ఏర్పడిన విశ్వాసాలు అప్పటికే స్థిరపడి ఉన్న విశిష్టాద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని, అప్పటికి విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యామునాచార్యుడు రామానుజుడిని విశిష్టాద్వైత మత ప్రవర్తకుడుగా ప్రోత్సహించాడని  అంటారు. రామానుజుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడైనప్పటికీ, కొన్ని సంప్రదాయాలను ఆయన పాటించలేదు. ఉదాహరణకు పదునెనిమిది సార్లు తిప్పించుకొని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించిన గోష్ఠీపూర్ణులనే తిరుక్కోట్టియార్ నంబి ఆదేశాన్ని కాదని ఒక విష్ణ్వాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలా ప్రకటించారు. తిరుక్కోట్టి యార్ నంబి యామునాచార్యుల శిష్యులలో ఒకరు. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించ వద్దనీ, విన్నంత మాత్రాన్నే ముక్తి కలుగుతుందనీ నంబి చెపితే *‘‘నేనొక్కడినీ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తే నేమి, అందరికీ ముక్తి కలుగుతుంది గదా!’’* అనే ఉదార భావనతో ఆయన గుడి గోపరం ఎక్కి తిరు మంత్రాన్ని అందరికీ అందించారు.

రామానుజులు బ్రహ్మ సూత్రాల శ్రీభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. దేశ వ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహా సనాధిపులను, జియ్యంగార్లను, పరమై కాంతులను నియమించారు. చాత్తాద వైష్ణవులూ, అమ్మం గార్లూ కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు. అస్పృశ్యత లాంటి దురా చారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు.  తన జీవితం ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహ త్యాగం చేశారు. ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం *‘‘ద్రావిడ, సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై, వడగలై అని రెండు శాఖలు ఏర్పడ్డాయి”* అని తిరుమల రామచంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన *‘‘భార్గవ పురాణం”* గ్రంథానికి పరిష్కర్తగా రచించిన *‘‘ఆళ్వారాచార్యుల చరిత్ర తత్త్వం”* వ్యాసంలో వ్రాశారు. (‘‘విశిష్టాద్వైతం” వివరణలో మరికొన్ని సైద్ధాంతిక విశేషాలు.)

*నామకరణం :-

శిశువు యొక్క జనన మాసం, మరియు రాశి దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ మాస రాశులతో సరితూగటం వల్ల, శిశువు మామ అయిన పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణుడు), ఆ శిశువు ఆదిశేషుని అవతారమని భావించి, *"ఇళయ పెరుమాళ్"* అనే నామధేయాన్ని నిర్ధారిస్తాడు. శిశువు శరీరంపైన ఉన్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి, నమ్మాళ్వార్ తన *'తిరువోయ్మోళ్ళి'* అను గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సాంప్రదాయాభివృధ్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి, గురువు, ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది.

*ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు :-

మొదటిది, ప్రబలంగా కొనసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.
రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతం లోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.
ప్రస్థాన త్రయాన్ని సాధారణ జనానికి అందించడం.

*తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి :-

ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.
దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.
మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో, తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.
ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.
వైష్ణవ సాంప్రదాయాలకు సంకేతమైన, పంచ సంస్కార కర్మ, నాలాయిర దివ్య ప్రబంధ బోధన, శరణాగతి తో కూడిన మత ప్రతిపాదన మరియు ప్రచారం, అనే ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించటం.
వేదాంతానికి మూలస్తంభాలవంటి వేదాంత సూత్రాల కు సరిక్రొత్త వ్యాఖ్యానం వ్రాయటం.
భాగవత, విష్ణుపురాణాల ను రచించిన వేదవ్యాస, పరాశర మునుల అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి, వారికా నామధేయాలను ప్రసాదించి, వ్యాస, పరాశరులకు నివాళులు అర్పించటం.
ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి, అందరికీ ఉపదేశిస్తాడు. గురువు 'నీవు నరకానికి వెడతావేమో' నని అంటే అందరూ స్వర్గానికి వెడతారని బదులిస్తాడు.

*తిరుమల ఆలయ వ్యవస్థల ఏర్పాటు :-

తిరుమలలోని మూలవిరాట్టు(ధ్రువబేరం) విష్ణుమూర్తి విగ్రహం కాదని, శక్తి విగ్రహమో, శివ ప్రతిమో, సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చని వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపుచేయించి శైవారాధనలకు అవకాశం ఇమ్మని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి వాదించారు. శాక్తేయులతో, శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను, శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారనీ, రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, శక్తి ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూశారని ప్రతీతి. రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయంటారు. మొత్తానికి తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు.
అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయపూజారులకు అగ్రహారమిచ్చి, వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజును పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి అయినా తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖానస ఆగమాన్ని కొనసాగించారు. ఐతే అప్పటికి ఉన్న వైదికాచారాలతోపాటుగా ద్రవిడవేదాలను, పాంచరాత్రాగమ ఆచారాలను కొన్నింటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు. తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో, మూర్తి స్వరూపనిర్ధారణలో, ఆగమ పద్ధతుల్లో తిరుమల-తిరుపతిపైన రామానుజాచార్యునిది చెరగని ముద్ర....గుండా శ్రీనివాస్

*!! శ్రీమతే రామానుజాయ నమః !!*
*శ్రీమతే నారాయణాయ నమః !!*

Friday, 10 April 2020

kattu swami story ( unknown story in maha Bharath)

*మహాభారతంలో మహా మహులను అందరినీ ఒక్క నిముషంలో చంపి యుద్ధం మొత్తం ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి  కథ:* ఎన్ని రకాల కేరక్టర్లు, ఎన్ని రకాల తత్వాలు. మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి. కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భమలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకూ మహాభారతమే. మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన కేరక్టర్ ఒకటి ఉంది. తన పేరు బర్బరీకుడు. బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో. కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి. నిజానికి మహాభారతం అంటేనే శ్రీకృష్ణుడి చరిత్ర అనుకుంటాం. నిజానికి మహాభారతం నిండా కూడా శ్రీకృష్ణుడే. తను లేనిదే మహాభారతం లేదు. ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా. తను ఘటోత్కచుడి కొడుకు. లక్క ఇల్లు తగులబడ్డాక, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో హిడింబి అనే ఓ రాక్షస యువతిని పెళ్లిచేసుకుంటాడు భీముడు. వాళ్ల కొడుకే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు ఓ యాదవ రాజు మురు బిడ్డ మౌర్విని (అహిలావతి) పెళ్లాడతాడు. వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు. నిజానికి తను ఓ యక్షుడు. ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు. రాజస్థాన్లో ఖటుశ్యామ్జీ పేరిట, గుజరాత్లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని. అక్కడి జానపదాలు ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకెళ్లాయి. తను చిన్నప్పటి నుంచే తల్లి దగ్గర యుద్ధవిద్యలు నేర్చుకుంటాడు. దేవీ ఉపాసకుడు కూడా. దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది. ఆ మూడు బాణాల్నే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను *త్రిబాణధారి* అంటారు. పాండవులు, కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిశాక, భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకూ చేరుతున్న వేళ, బర్బరీకుడు ఆ యుద్దాన్ని చూడాలని కోరుకుంటాడు. వెళ్లే ముందు తల్లికి ఓ మాట ఇస్తాడు. *ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను. ఓడిపోయేవారిని గెలిపిస్తాను అని.* తర్వాత తన ధనుస్సు, నీలి గుర్రం, తన మూడు బాణాలు తీసుకుని బయల్దేరతాడు. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ప్రతి యోధుడినీ శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు. *నీకే బాధ్యతలు ఇస్తే యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు? ఇదీ ప్రశ్న.* 20 రోజులు చాలునని భీష్ముడు అంటే, 25 రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు. 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 రోజులు పడుతుందని అర్జునుడు. ఇలా తలా ఓ రకంగా చెబుతారు. దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు *శ్రీకృష్ణుడు.* ఒంటరిగా తనను ఓ బ్రాహ్మణవేషంలో సమీపించి శ్రీకృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకూ ఆ ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా? అని అడుగుతాడు. *నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు.* శ్రీకృష్ణుడు ఒక్కక్షణం దిగ్భాంతికి గురై, అదెలా సాధ్యం అనడుగుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు. వాటి శక్తి వివరిస్తాడు. నేను మొదటి బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని, వాళ్లందరినీ గుర్తించి పెడుతుంది. (టార్గెట్స్ ను ఐడెంటిఫై చేస్తుంది. రెండో బాణాన్ని వేస్తే ఎవరెవరిని రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది. మూడో బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్లను విడిచిపెట్టి, మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదాన్నీ ధ్వంసం చేస్తుంది. ఆ బాణాలు మళ్లీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు. నేను నమ్మను, నేనే కాదు, ఈ సృష్టిలో ఎవరూ దీన్ని నమ్మరు, నమ్మలేరు అంటాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది. ఏదీ, ఆ రావిచెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు శ్రీకృష్ణుడు. చాలా సులభం అంటాడు బర్బరీకుడు. చేసి చూపించు అంటాడు శ్రీకృష్ణుడు. బాణం వదిలేముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్లు మూసుకుంటాడు బర్బరీకుడు. ఈలోపు శ్రీకృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు. ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది. చివరకు శ్రీకృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది. ఇదేమిటి అనడుగుతాడు అమాయకంగా శ్రీకృష్ణుడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది. అందుకే అదక్కడకు వచ్చింది. నీ పాదం తీసివేయి. లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్లి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అది అంటాడు బర్బరీకుడు. తప్పనిసరై పాదం తీసేస్తాడు. మరో బాణం వెళ్లి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది. (రక్షింపబడాల్సినవి). తరువాత బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి, ఒక్క దగ్గర మోపు కట్టేస్తుంది. ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీకృష్ణుడు. ఈ బాణాల శక్తి నుంచి ఎవరినీ దాచలేమనీ, కాపాడలేమనీ అర్థమవుతుంది. అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పుందని, గందరగోళం ఉందనీ గమనిస్తాడు. బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవపక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేననీ గుర్తించి కలవరపడతాడు. ఒకవేళ భీముడి మనమడు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది? అందుకే దివ్యదృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకుని ఇలా ఓ లాజికల్ సంభాషణ ఆరంభిస్తాడు. ఏమోయీ, నువ్వు ఎవరు? నువ్వు కూడా యుద్ధం చేస్తావా? అని అడుగుతాడు. నేను ఘటోత్కచుడి కుమారుడిని. యుద్ధం చూడాలని వచ్చాను. యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను. పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణులు. అంటే పాండవులే బలహీనులు కదా. అవును, అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుంది. అదే జరిగితే వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు. కౌరవులు బలహీనులు అవుతారు కదా. అవునవును. తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది. కానీ దాని వల్ల కౌరవులు బలోపేతులై తిరిగి పాండవులు బలహీనులు అవుతారు కదా. మరేం చేయుట? ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది. తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటూ స్థిరంగా నిలబడలేనని అటూఇటూ మారితే చివరకు ఇరుపక్షాలూ సమూలంగా హతమారిపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అనీ. విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది. శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ఎవరు మహాశయా మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా. ముందు నాకు ఓ వాగ్దానం చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు శ్రీకృష్ణుడు. అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు. యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా. ఇంత భారీ జనహనన యుద్దాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ. నిన్నెవరూ హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలను తీసి నాకివ్వు అంటాడు శ్రీకృష్ణుడు. నన్నే ఎందుకు బలి ఇవ్వాలి? ఇంతమంది యోధులు ఉండగా. పైగా వాళ్లంతా ప్రాణాలకు తెగించి వచ్చినవాళ్లు కదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు. *బర్బరీకా నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి* భూమి మీద అధర్మం పెరిగిపోయింది నువ్వే కాపాడాలి *శ్రీమహావిష్ణు* అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు *ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా* అని ఒకింత పొగరుగా మాట్లాడావు. దానికి నోచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. *ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే* అని శపించాడు. అందుకే నీ బలి. అంతేకాదు నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ నాకు యుద్దాన్ని చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు. ముందు నీ తలను ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు. యుద్ధం ముగిసింది. విజయ గర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు. వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు శ్రీకృష్ణుడు. తన కథ చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తరువాత శ్రీకృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు. *వత్సా! ఈ మొత్తం యుద్దంలో ఏ క్షణమేం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే, నువ్వు చెప్పు ఏం గమనించావో?* స్వామీ! ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను. మహాకాళి వేల నాలుకలతో పాపులను బలితీసుకోవటాన్ని చూశాను. ఆ మహాశక్తి నువ్వు మాత్రమే. యుద్ద కారకులు, యుద్ధకర్తలు, మిగతావాళ్లంతా కేవలం పాత్రధారులు మాత్రమే అని సమాధానమిచ్చి తన శాపం ముగిసిపోయి తిరిగి యక్ష రూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోతాడు. ఇదీ మహాభారతంలోని బర్బరీకుడి కథ. 🙏🙏🙏

108 Names of Lord Rama & Meanings

Here is the Sri Ram Ashtothram (108 Names of Lord Rama) along with their meanings: 1–20 1. Om Ramaya Namah – Salutations to Sri ...