Tuesday, 28 April 2020

ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మ

*ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మ 

తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అని ఒక మహాతల్లి ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆవిడ ధృతి, దీక్ష ఎంత గోప్పవంటే - ఆవిడ జీవితములో ఒకేఒక్కసారి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికని బయలుదేరారు. బయలుదేరి, గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చునారు, బోయీలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే, పెద్దవాళ్ళు "ఒక్క అరగంట లో గన్నవరం వెళ్లీపోతాం... అక్కడ సీతమ్మ గారు మనకు అన్నం పెడతారు" అని మాట్లాడుకోవటం విన్నారు సీతమ్మగారు. వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి, పల్లకి వెనక్కి తిప్పెయ్యండి... వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. అంతటి నిరతాన్న దాత ఆవిడ.

ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే, అందరికీ పెట్టి పెట్టి, ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది. ఒకానొకప్పుడు ఆవిడ భార్తగారు "ఎందుకు ఇంకా ఈ అన్నదానం? మనకి కూడా తినటానికి ఏమీ లేదు. వచ్చి ఎవరైనా తలుపుకొడితే సిగ్గేస్తోంది! పెట్టడమా మానవు! ఇంత అన్నం పప్పైనా పెడతావు..." అన్నారు. దానికి ఆవిడ "నేను నిస్వార్థముగా పెట్టేటప్పుడు, వచ్చిన వారు తింటున్నప్పుడూ వచ్చినదీ, తింటున్నదీ శ్రీ మహా విష్ణువని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు? మనకీ వాడే పెడతాడు" అని చెప్పి పెట్టింది. ఇన్నాళ్ళ నుంచీ దున్నుతున్న అదే పొలానికి వెళ్లి సీతమ్మ గారి భర్త ఒక రోజు సాయంకాలం గొయ్యి తవ్వుతున్నారు. గునపానికి ఏదో తగిలి ఖంగుమంది. ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే, దాని నిండా బంగారు నాణాలే. తీసుకొచ్చి ఇంట్లో బంగారు కాసుల రాశులు పోసి, మళ్లీ రొజూ కొన్ని వందల మందికి అన్నదానం చేసారు.

ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలక్టరుకి డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని ఉత్తరం వ్రాసాడు. దేనికి అంటే "నాకు పట్టాభిషేకము జరిగేటప్పుడు ఆవిడకు నమస్కారం పెట్టాలి. కానీ ఆవిడ సముద్రము దాటి రారు కాబట్టి, ఆ సమయములో ఒక సోఫా వేసి, ఆవిడ ఫోటో అందులో పెట్టి, ఆవిడకు నమస్కారము పెట్టి అప్పుడు పట్టాభిషేకము చేసుకుంటా" అని వ్రాసాడు. తూర్పు గోదావరి జిల్లా కలక్టరు గారు ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, "నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. విష్ణు మూర్తికి అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు పట్టభిషేకలు ఎందుకు, వద్దు" అన్నారు ఆవిడ. "అమ్మ ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు" అని ఆ కలక్టరు గారు చెబితే, "నీ ఉద్యోగం పోతుంది అంటే, తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి" అని తీయించుకున్నారు ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్థముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ది కోసం పాటుపడితే, వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం....🙏

No comments:

Post a Comment

Melkote idol Walks to near Ramanujachary

The devotional legend of Ramanujacharya retrieving the utsava murti (Selva Pillai or Ramapriya) from Delhi, the idol is said to have miracul...