Wednesday, 27 May 2020

‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు)

 ‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు)  - 
‘సేక్రెడ్‌ ఫుడ్స్‌ ఆఫ్‌ గాడ్‌’....తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు

  తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి... చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు. మరి... వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా? ఇవి మాత్రమే కాదు... ఏడుకొండల వాడికి పూట పూటకూ ఒక మెనూ! రుతువులను బట్టి ఆహారం! స్వామి వారికి సకల విధమైన నైవేద్యం! అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ వివరాలతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు) అనే పుస్తకం రాశారు. దాని తొలి ప్రతిని ఆయన అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అందించారు. ఏడు కొండల వాడి దివ్య ప్రసాదాలపై పుస్తకంలోని విశేషాలను రమణ దీక్షితులు ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

 ఆ వివరాలు మీకోసం ప్రత్యేకం...

సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు వినియోగించరు. ప్రసాదం వండేవారు వంట సమయంలోగానీ, తర్వాతగానీ వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక... శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ దానిని చూడకూడదు.

 

నేవైద్యం పెట్టేది ఇలా...

ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు. గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు. స్వామి, ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు. విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు. కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. (స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట.) పవిత్ర మంత్రాలు ఉచ్ఛరిస్తూ అన్నసూక్తం నిర్వర్తిస్తారు. చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే. ఈ విధంగా స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధగుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు.

 

నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు. రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు. పది, పదకొండు గంటల మధ్య రాజభోగం, రాత్రి ఏడు - ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు. తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు. నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు. ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.

 

ఉదయం బాలభోగం

    మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి

మధ్యాహ్నం రాజభోగం

    శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం

రాత్రి శయనభోగం

    మరీచ్యఅన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం(వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం)

అల్పాహారాలు

    లడ్డు, వడ, అప్పం, దోసె

స్వామి మెనూ ఇదీ...

ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగు తేలే ఆవుపాలు సమర్పిస్తారు. తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు. ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది. సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి... స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు! అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గూడాన్నం) పెడతారు. ఇక పవళించే సమయం దగ్గరపడుతుంది. ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేంచిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.

 

ఇదీ ‘ప్రసాదం’

బియ్యం, ధాన్యాలు, ఆవు పాల పదార్థాలు, ఔషధ గుణాలున్న వస్తువులు, వనస్పతులు, లవంగాలు, యాలకులు, తులసి, మిరియాలు... ఇవన్నీ శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోస్తారు. హింసలేని ప్రపంచాన్ని కోరుకున్న మహర్షులు నిర్దేశించిన ప్రసాదాలు ఇవి! ప్రసాదం అంటే ఆకలి తీర్చే ఆహారం కాదు! పవిత్రంగా పరిమితంగా స్వీకరించవలసిన పదార్థం. ఈ అంశాలను భక్తజనానికి వివరించడమే ఈ పుస్తక పరమోద్దేశం! ‘సేక్రెడ్‌ ఫుడ్స్‌ ఆఫ్‌ గాడ్‌’ పుస్తకాన్ని రాయడానికి నాకు రెండేళ్ల సమయం పట్టింది.

 

నా అనుభవాలన్నిటినీ ఇందులో రాశాను. ఈ పుస్తకంపై వచ్చే రాయల్టీని తిరుమలలోని అన్నప్రసాద పథకానికి ఇవ్వాలని సంకల్పించాను. ఈ పుస్తకాన్ని చూడగానే రాష్ట్రపతి అభినందించారు. ప్రపంచంలోని శ్రీవారి భక్తులందరికీ అర్థమవ్వాలనే తొలిగా ఆంగ్లంలో విడుదల చేశాం. త్వరలో తెలుగు, తమిళం, హిందీ, ఇతర భాషల్లో విడుదల చేయటానికి ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థ అయిన పెంగ్విన్‌ శ్రీవారి వైభవాన్ని తెలిపేలా పుస్తకాలను రాయమని కోరారు. స్వామి ఉత్తర్వులే అనుకుని రాయటానికి ఒప్పుకున్నాను.

- *రమణ దీక్షితులు, టీటీడీ ప్రధానార్చకుడు*
 Detional information by www.saisaranam.in

No comments:

Post a Comment

108 Names of Lord Rama & Meanings

Here is the Sri Ram Ashtothram (108 Names of Lord Rama) along with their meanings: 1–20 1. Om Ramaya Namah – Salutations to Sri ...