లలితా సహస్రనామాలు కూడా హయగ్రీవుని ద్వారానే వచ్చాయి. జ్ఞానం, విద్య, సద్య స్ఫురణ, సృజనాత్మకత కావాలనుకునే వారు హయగ్రీవుని ఆరాధించాలి
హయగ్రీవుడు చదువులకు అధిదైవం. అందరం ప్రతినిత్యం చదువుకునే ఈ లలితా సహస్రనామాలు కూడా హయగ్రీవుని ద్వారానే వచ్చాయి. జ్ఞానం, విద్య, సద్య స్ఫురణ, సృజనాత్మకత కావాలనుకునే వారు హయగ్రీవుని ఆరాధించాలి. అవి కావాలని అందరూ కోరుకుంటారు కనుక అందరూ హయగ్రీవుని ఉపాసన చేయడం మంచిది. శ్రవణానక్షత్రం ఏ పూర్ణిమనాడుంటే ఆ మాసాన్ని శ్రావణమాసం అంటారు. శ్రవణం శ్రీహరి జన్మ నక్షత్రం. పూర్ణిమ లక్ష్మీదేవి పుట్టినతిథి. ఆ రెండు కలిసిన శ్రావణపూర్ణిమకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమయే ‘హయగ్రీవ జయంతి’. హయగ్రీవుడనగానే సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించి, గుఱ్ఱపు మోముగల ఒక వేదాపహారియైన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించినవాడని మనకు తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో పది అవతారాలు మాత్రం దశావతారాలుగా ప్రసిద్ధికెక్కినప్పటికీ, మహాభాగవతంలో ఇరవైకి పైగా అవతారాలు పేర్కొనబడి ఉన్నాయి. ఆ అవతారాలలో ‘హయగ్రీవావతారం’ విశిష్టమైనది. ‘హయం’ అనగా గుఱ్ఱం, ‘గ్రీవం’ అనగా కంఠం. అశ్వ ముఖంతో మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భుజాలతో, శంఖ, చక్ర చ...