Monday, 19 March 2018

ఉగాది ugadhi

ఉగాది రోజున ఏం చేయాలి?*_

ఉగాది ఈ నెల 18వ తారీఖున వస్తోంది. ఉగాదిని సంవత్సరాది అని కూడా అంటారని తెలిసిందే. ఉగాది రోజున వేకువ జామున బ్రహ్మ ముహూర్తంలో తలకు నూనె పట్టించి తలంటు స్నానం చేయాలి. పర్వదినాలలో తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి నివాసం ఉంటారట. అందుకని ఆ రోజులలో తలకు నూనె రాసుకొని తలంటుస్నానం చేస్తే లక్ష్మీదేవి, గంగా మాతల అనుగ్రహం పొందుతామని పెద్దలు చెప్తారు. నూతన వస్త్రాలు కట్టుకొని, తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని, మామిడి తోరణాలు కట్టుకొని, పూజకు కావల్సినవి సిద్ధం చేసుకోవాలి. గడపకు పసుపు రాసి, బొట్టు పెట్టుకోవాలి.

మన ఇష్ట దైవాన్ని పూజించాలి. తులసి చెట్టుకు పూజ చేయాలి. లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి తులసీదళాల మాల సమర్పించుకోవాలి. మన ఇష్టదైవాన్ని తులసి దళంతో అష్టోత్తరం చేయాలి. ఉగాది రోజున ప్రత్యేక ప్రసాదం ఆరు రుచులు కలిగిన అంటే పులుపు, చేదు, తీపి, ఉప్పు, కారం, వగరుతో ఉగాది పచ్చడి చేసి దేవునికి నివేదన ఇవ్వాలి. మనస్సులో దైవాన్ని నివేదన స్వీకరించి ఆయన ఉచ్చిష్టాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. తర్వాత హారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఈ పూజ విదానం అంతా భక్తిశ్రద్ధలతో, విశ్వాసంతో చేయాలి. అప్పుడే ఆ పూజ దైవానికి చెందినట్లు. ఆ తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి. మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి.

ఉగాది రోజున దేవాలయ దర్శనం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది రోజున నీరు నింపిన దర్మకుంభం.. అంటే కలశాన్ని పెద్దలకు ఇస్తే చాలా మంచి ఫలితం కలుగుతుందట.

ఉగాది పచ్చడిలో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. అవేంటంటే.....
1. పులుపు... పులుపు అంటే చింతపండు. ఉగాది పచ్చడిలో కొత్త చింతపండుని వేయడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. పులుపు ఆకలిని పెంచుతుంది. అరుగుదలకు తోడ్పడుతుంది. పంచేంద్రియాలను పరిపుష్టి చేస్తుంది.

2. తీపి.. ఉగాది పచ్చడిలో కొత్త బెల్లాన్ని కలపడం వల్ల ఉపయోగాలు. బెల్లంలో ఉండే లోహ ధాతువులు శరీరంలోకి తేలిగ్గా విలీనం అవుతాయి. ఎండా కాలం వడదెబ్బ నుండి రక్షిస్తుంది. వాతాన్ని హరిస్తుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.

3. ఉప్పు... గ్యాస్‌ను తగ్గిస్తుంది. మలబద్దకాన్ని నిరోధిస్తుంది.

4. కారం.. పచ్చిమిర్చిని వేయడం వల్ల ఆకలిని పెంచుతుంది. ప్రేగు లోపల ఉండే పురుగులను చంపుతుంది. దురదలను తగ్గిస్తుంది.

5. చేదు.. వేప పూత ఆకలిని పెంచుతుంది. ఎండాకాలంలో వచ్చే వడదెబ్బ, జ్వరాల నుండి కాపాడుతుంది. విషానికి విరుగుడులా పనిచేస్తుంది. దప్పికను తగ్గిస్తుంది.

6. వగరు.. కొత్త మామిడికాయ వగరుగా ఉంటుంది. ఇది రక్త స్రావాన్ని తగ్గిస్తుంది. గాయాలను మాన్పుతుంది.


No comments:

Post a Comment

Melkote idol Walks to near Ramanujachary

The devotional legend of Ramanujacharya retrieving the utsava murti (Selva Pillai or Ramapriya) from Delhi, the idol is said to have miracul...