Sunday, 21 July 2019

తిరుమల తిరుపతి ధ్వజస్తంభం కథ

కర్ణాటక దండేలీ అడవుల్నుంచి 75 అడుగుల
పొడవున్న 6 టేకుమానులు తీసుకుని 16 చక్రాల
ట్రాలీ బయలుదేరింది. ఇంత భారీ వాహనం
చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు!డ్రైవర్
రెండు చేతులూ జోడించి దేవుని ప్రార్ధించాడు.
వందల కంఠాలు"గోవిందా! గోవిందా!"
అంటూ ప్రతిధ్వనించాయి. అతన్ని ఏ శక్తి
నడిపిందో మరుసటిరోజు సాయంత్రానికి
గమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ఆ ట్రాలీ
చేరుకుంది. డ్రైవర్ దిగి కొండవేపు చూశాడు.
కలియుగ దైవం వేంచేసివున్న సప్తగిరి.
చుట్టూ చూశాడు. వేలాది యువతులు
హారతులిచ్చి, గోవిందా, గోవిందా అంటూ
తన్మయులైనారు.

అక్కడే ఉన్న టి.టి.డి.చైర్మన్ నాగిరెడ్డిగారికి,
ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి
నమస్కరించి" ఘాట్ రోడ్డు 18 కిలోమీటర్లు,
ఏడు ఎనిమిది క్లిష్ఠమైన మలుపులున్నాయి.
ఇది నా జీవితంలోనే గొప్ప సాహసం.
ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్కును ఆపకుండా కొండ
మీదకు తీసుకుపోతాను. మధ్యలో పిట్టగోడలు
దెబ్బతినొచ్చు,అంచులు తగిలి బండరాళ్లు
దొర్లిపడవచ్చు,మీరు హామీ ఇస్తే పైకి చేర్చి
తీరుతాను అన్నాడు" వారు డ్రైవరుతో
పైకి చేర్చే బాధ్యత నీది.మిగిలిన బాధ్యతలు మావి
అని అభయం ఇచ్చారు. వాహనాల రాకపోకలను,
పాత ఘాట్ రోడ్డుకు మళ్లించారు. ట్రక్కు
బయలుదేరింది.వెనుకే వాహనాల్లో అందరూ
బయలుదేరారు. ఒక్కో మలుపు తిరుగుతుంటే
మానులు తగిలి, బండలు ఊడిపడ్డాయి.
పిట్టగోడలు కూలిపడ్డాయి. ట్రాలీ  లోయలో పడిపోతుందేమో అని వెనుక వారికి భీతి కలిగేది.
ఇలా గుండెలు ఉగ్గబట్టుకుని, ఫీట్లు చేసుకుంటూ
సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాల్లో..
సూర్యాస్తమయం లోగా
ట్రాలీ తిరుమల చేరిపోయింది.
వేలాది భక్తుల ఆనందోత్సాహాలతో
గోవిందా..గోవిందా..నామస్మరణతో
తిరుమల కొండ ప్రతిధ్వనించింది!
☘స్వామి వారి ధ్వజస్తంభం కోసం
దండేలీ అడవుల్లోపుట్టి 300 ఏళ్ల వయసున్న
ఈ 6 టేకుమానులు స్వామి వద్దకు
క్షేమంగా చేరుకున్నాయి👌

🍀ఏమిటీ ధ్వజస్తంభం కథ?

నాగిరెడ్డిగారు మర్రి చెన్నారెడ్డి ఆదేశాల మేరకు
టిటిడి చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.
తిరుమలలో అనేక మరమ్మత్తులు చేపట్టారు.
అందులో భాగంగానే  ధ్వజస్థంభానికి బంగారు
తాపడానికి పాలిష్ చేయడం.
నాగిరెడ్డి గారికి తోడుగా సమర్ధుడైన
ఐ.ఏ.ఎస్ అధికారి పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు
ఎక్జిక్యూటివ్ ఆఫీసరుగా వున్నారు.
ఈ పనులన్నీ ప్రసాద్ గారు చిత్తశుద్ధితో చేసేవారు!
అప్పటి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరామయ్య!
ఇలా ధ్వజస్తంభం చుట్టూ వున్న నాలుగు వరుసల
గోల్డ్ ప్లేట్లు విప్పి పాలిష్ చేసే సమయంలో
అసలు విషయం బయటపడింది.
ధ్వజస్తంభాన్ని టేకుతో చేస్తారు. చూస్తే
ఆ మానంతా పుచ్చిపోయివుంది. భూమిలో
ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు?
మరి ఏ ఆధారంతో ధ్వజస్తంభం నిలిచిఉంది?
కేవలం ఆ బంగారు ప్లేట్ల ఆధారంతో అది ఉంది.
రేపో మాపో అది కూలిపోవచ్చు!
మరి ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి?
వేరే వారైతే దాన్ని తాత్కాలికంగా ఏదో
చేసేయ్యండి. 75 అడుగుల టేకుమానులు
బజారులో దొరకవు అని సర్దుబాటు చేసేవారు!
కానీ ఇక్కడ ఉన్నది..నాగిరెడ్డి, పివిఆర్కే ప్రసాద్!
స్వామి వారి సేవలో అచంచల భక్తి వున్నవారు.
స్వామివారికి, ఆయన భక్తులకు ఏ చిన్న లోపం
జరిగినా ఆ పాపం తమదే అని విశ్వసించే వారు.
అందుకే "ధ్వజస్తంభాన్ని పునర్మిద్దాం"
అని ప్రకటించారు👌
ప్రకటించారు సరే..అసలు కథ ఇప్పుడే మొదలైంది!

🛑ధ్వజస్తంభం వాడే మానుకి ఆగమశాస్త్రం
ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి.
ఆ మానుకి,ఎలాంటి తొర్రలు,పగుళ్లు,వంకలు,
కొమ్మలు ఉండకూడదు.75 అడుగుల ఎత్తున్న
ఒకే మాను కావాలి. వందేళ్లకు పైగా మన్నిక
కల్గిన టేకు చెట్టు అయివుండాలి.
ఎక్కడ? ఎక్కడ?
ఈ లక్షణాలున్న చెట్లు దొరుకుతాయి?
☘పాత మాను గురించి తెలుసుకుంటే
దొరుకుతుంది అని 190 సంవత్సరాల
రికార్డులన్నీ పరిశీలిస్తే..
ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావన లేదు.
మరో వేపు నాగిరెడ్డిగారు, ప్రసాద్ గారు ఇద్దరి
నియామకాల గడువు పూర్తి కానున్న తరుణం.
ఈ కొద్ది రోజుల్లో మనం.....
ఇది చేయగలమా????ప్రశ్నలు???

🍀ఆ సమయంలో బెంగుళూరు నుండి వచ్చిన
ఓ భక్తుడు వారిని కలిసి" అయ్యా! మీరు
ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నట్లు
రేడియోలో విన్నాను. అటువంటి మానులు
కర్ణాటక దండేలీ అడవుల్లో ఉన్నాయి.
మీరు అనుమతిస్తే నేను ఆ పనిచేసి పెడతాను!
వారంలోగా ఆ భక్తుడు వంద చెట్లను పరిశీలించి,
అందులో నిర్ణీత ప్రమాణాలకు అనుకూలంగా
ఆరు చెట్లను ఎంపిక చేశారు.అదే వారంలో
కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావుగారు
కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి
వచ్చారు..ఆయన ముందు ఈ ప్రతిపాదన ఉంచారు.
ఆయన ఆనందంగా మహద్భాగ్యం అన్నారు.
ధ్వజస్థంభానికి ఒక్కమాను సరిపోతుంది. అయినా
ముందు జాగ్రత్తగా 6 చెట్లనూ తీసుకున్నారు.
సమస్య అక్కడితో అయిపోలేదు.
దట్టమైన అడవిలో, కొండ వాలులో ఉన్న వీటిని
మొదటికంటా తీయించి 8 కిలోమీటర్ల కిందికి
తీసుకు రావడం చిన్న పనికాదు. రోడ్డు నిర్మించే
బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటే..
సోమానీ పేపర్ మిల్లు వారు ఈ భాగ్యం
మాకు ప్రసాదించండి అని..దుంగల్ని
క్రేన్ల సహాయంతో రోడ్డు వరకూ చేర్చారు.
ట్రాలీకి 70,000 రూపాయల అద్దె! ట్రాలీ
బయలుదేరింది. ఎటువంటి ఆటంకాలు
లేకుండా తిరుమల చేరుకుంది!
1982 జూన్ 10వ తేదీన
ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించారు!

🍁ఉత్సవం చివరన నాగిరెడ్డిగారు ట్రైలర్
యజమానికి 70 వేల రూపాయల చెక్కును
అందించారు! యజమాని..
"స్వామివారి సేవకు నాకు బాడుగా? 5 రోజులు
ఆయనతో వున్న నేను కదా చెల్లించాలి!"
అని దానిని తిరస్కరించారు!
డ్రైవరును స్వామివారి సమక్షంలో సత్కరించారు.
స్వామి వారి సన్నిధిలో నాగిరెడ్డి, పివిఆర్కె ప్రసాద్,
ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్యను
సత్కరించి, ఆయన చేతిలో ఓ కవర్ ఉంచారు!
అది విప్పి చూసిన వెంకట్రామయ్య కళ్ళలో
కన్నీళ్లు.. ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న తన
ప్రమోషన్ ఆర్డర్ అది! ఇలా..స్వామివారి
సన్నిధిలో.. ఎందరికి ప్రాప్తం?..అనుకుంటూ..
ఆయన రెండు చేతులూ జోడించి
ఆనందడోలికల్లో మునిగిపోయారు!
               🕉
www.saisaranam.in

No comments:

Post a Comment

Marathwada Liberation Day or Marathwada Mukti Sangram Din—is celebrated every year on 17th September

Marathwada Liberation Day or Marathwada Mukti Sangram Din—is celebrated every year on 17th September to mark the liberation of the Marathwad...