రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ సముద్రతీరంలో ఉంది. ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి
రామేశ్వరజ్యోతిర్లింగ
రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ సముద్రతీరంలో ఉంది. ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి స్కాందపురాణం ఎంతగానో వర్ణించింది. ఈ జ్యోతిర్లింగం శ్రీరామచంద్రుని చేతులమీదుగా ప్రతిష్టించబడింది. రామేశ్వరస్వామి దేవాలయం 1000 అడుగుల పొడవు, 650 అడుగుల వెడల్పు, 150 అడుగుల ఎత్తు కలిగి అనంతమైన శిల్పకళతో అలరారుతోంది. ఈ క్షేత్రంలో నందీశ్వరుడు, వెండి రథము, బంగారు గోపురాలు చూడవలసినవి. ఆలయం చుట్టూ 1200 స్తంభాలతో కూడిన ప్రదక్షిణ మండపం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో 23 తీర్ధాలు ఉన్నాయి. కాగా సముద్రాన్ని 24వ తీర్థమైన అగ్ని తీర్థముగా చెబుతారు. ఉత్తర భారతం నుండి వచ్చే యాత్రికులు గంగాజలన్ని తెచ్చి రామలింగేశ్వరునికి అభిషేకిస్తారు. మన దక్షిణాదివారు రామేశ్వరంలో సముద్రమునందలి ఇసుకను సేకరించి కాశీలో గంగానదిలో కలుపుతారు. ఈ పుణ్యకార్యం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని నుండి నేటివరకు కొనసాగుతూనే వుంది.
పురాణగాథ:
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన తరువాత సీతతో కలసి సపరివారంగా పుష్పక విమానంపై సముద్రాన్ని దాటి గంధమాదన పర్వతానికి వచ్చాడు. అక్కడ మునులంతా శ్రీరామచంద్రుని చూచి పులస్త్యబ్రహ్మ కొడుకైన రావణాసురుని చంపటంవలన బ్రహ్మహత్యాపాపం సంభవించిందని, కనుక ఆ పాపపరిహారార్థం ఆ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించవలసినదిగాను చెప్పారు.
శ్రీరాముడు శివలింగమును తీసుకొనిరమ్మని హనుమంతుని కైలాసానికి పంపాడు. ఆంజనేయుడు శివలింగమును తెచ్చునంతలో శుభముహూర్తం సమీపించినందువల్ల ఋషుల ఆజ్ఞప్రకారం సీతాదేవి చేతులతో అక్కడ ఇసుకను పోగు చేయించి శివలింగమును సిద్ధంచేసి యథావిధిగా శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠ పూర్తి అయ్యే సమయానికి హనుమంతుడు శివలింగంతో వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని చాలా బాధపడ్డాడు. తన పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న హనుమంతుని శ్రీరాముడు పైకి లేవనెత్తి బుజ్జగిస్తూ జరిగినదానికి కారణాన్ని చెప్పాడు.
శ్రీరాముని మాటలు హనుమంతునికి తృప్తిని కలిగించలేదు. అప్పుడు శ్రీరాముడు ఒక నవ్వు నవ్వి “ఆంజనేయా శుభముహూర్తం మించినదని కదా ప్రతిష్ఠ జరిపితిమి. నీకు ఇష్టం లేనిచో ఆ లింగమును పెకలించి వేయుము. తరువాత నీవు తెచ్చిన లింగమునే అక్కడ ప్రతిష్టించుదము” అన్నాడు. హనుమంతుడు పట్టరాని సంతోషముతో కుప్పిగంతువేసి, ముందుకు దూకి, శివలింగాన్ని పెకిలించాలని ప్రయత్నించాడు. గొప్ప బలసంపన్నుడైన వాయుపుత్రుడు ఎంత ప్రయత్నించినా శివలింగం కదలలేదు. పొడవాటి తన తోకను లింగం చుట్టూ చుట్టి బలవంతంగా ఒక్క గుంజు గుంజాడు. ఆవగింజంతైన ఉపయోగం లేకపోగా ఆ ఊపుకు హనుమంతుడు ఎగిరి క్రిందపడి మూర్చపోయాడు. సీత భయపడింది. శ్రీరాముని బ్రతిమాలింది. రాముడు తన చల్లని చేతులతో హనుమంతుని శరిరాన్ని తాకి మూర్చను పోగొట్టి,తన వడిలోనికి చేరదీశాడు. కన్నీరు తుడిచి బుజ్జగిస్తూ “నాయనా శాస్త్రోక్తముగా స్వామిని ప్రతిష్ఠించాం కదా! ఇప్పుడు ఈ శివలింగాన్ని ప్రపంచంలోని ఏ శక్తీ కదిలించలేదు” అని ఓదార్చి హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని ఆ దగ్గరలోనే శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చయించి హనుమంతుని తృప్తిపరచాడు. రామునిచే ప్రతిష్ఠించబడిన లింగం రామేశ్వరునిగాను, హనుమంతుడు తీసుకొనివచ్చిన శివలింగం హనుమదీశ్వరునిగాను ప్రసిద్ధి పొంది పూజలను అందుకొంటున్నాయి.
Spirituality by www.saisaranam.in
9840344634
Comments
Post a Comment