Sunday, 24 November 2019

రామానుజాచార్యుల వారి దివ్య దేహం....

*రామానుజాచార్యుల వారి దివ్య దేహం.....*

భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం.

శ్రీ రామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం. కొందరు శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా...

అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు.

ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

రామానుజాచార్యుల గొప్పదనం..

రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు. కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా? శివ రూపానిదా?

అని వైష్ణవులు, శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు. తిరుమల స్వామి వారి గర్భాలయంలో శంఖు చక్రాలను ఉంచగా తెల్లవారి చూసే సరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమైంది. తిరుమల వెంకటేశ్వరుని నిత్య కైంకర్యాలను, సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారు.కొందరికే పరిమితమైన అష్టాక్షరీ ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియూర్ ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు. ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసి పుచ్చి..

తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు. ఇలా సమ భావన, సహ జీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు. ప్రాచుర్యంలోకి రాని రహస్యం: క్రీస్తు శకం 11 - 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు.

అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యుల వారి దివ్య దేహం అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది. కాబట్టి శ్రీరంగం పర్యటనకు మీరు వెళ్లినట్లయితే రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పక సందర్శించండి...

*|| ఓం నమః శివాయ ||*

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ ఎప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

Spirituality by www.saisaranam.in
9840344634

No comments:

Post a Comment

108 Names of Lord Rama & Meanings

Here is the Sri Ram Ashtothram (108 Names of Lord Rama) along with their meanings: 1–20 1. Om Ramaya Namah – Salutations to Sri ...