శ్రీకోదండరామాలయం - ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతంగా వెలసిన క్షేత్రమే
శ్రీకోదండరామాలయం - ఒంటిమిట్ట
Spiritual messages by www.saisaranam.in.
శ్రీరామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతంగా వెలసిన క్షేత్రమే కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం.త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ పురుషోత్తముడే ఇక్కడ నడిచినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగంలో స్వామివారు శ్రీకోదండరామస్వామిగా తన భక్తులకు అభయమిస్తున్నారు. శ్రీరామునికి అనుంగు భక్తుడైన ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ లేకపోవడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ఆంజనేయుని రాకకు ముందే ఈ క్షేత్రంలో స్వామివారు విహరించినట్టు తెలుస్తోంది.
జాంబవత స్థాపితం
వానరులలో బ్రహ్మజ్ఞాని జాంబవంతుడు. ఆయన ఎన్నో యుగాలను చూశారు. అనుభవశీలి, మేధావి, శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్న అనంతరం సీతారామ, లక్షణ విగ్రహాలను ప్రతిష్టించారు. కొద్దికాలానికి సంజీవరాయ మందిరంలో ఆంజనేయవిగ్రహాన్ని నెలకొల్పారు. కలియుగంలో ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ఒంటెడు, మిట్టడు అనే సోదరులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. వారిపేరుతోనే ఒంటిమిట్టగా ఈ గ్రామం ఖ్యాతిచెందింది. వీరి విగ్రహాలను కూడా ఆలయప్రాంగణంలో చూడవచ్చు.
అద్భుతమైన ఆలయనిర్మాణం
ఆలయ నిర్మాణం విజయనగరవాస్తుశైలిలో అద్భుతంగా నిర్మితమైవుంటుంది. మూడు గోపురాలు సుందరంగా వుంటాయి. ఆలయం లోపల స్తంభాలు, గోడలపై సజీవమైన చిత్రకళను వీక్షించవచ్చు. విఘ్నేశ్వరుడు నాట్యభంగిమలో వుండి భక్తులకు ఆశీర్వచనం ఇస్తుంటాడు. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో పర్యటించిన ఫ్రెంచ్ యాత్రీకుడు టావెర్నియర్ ఆలయ గోపురం దేశంలోని పొడవైన గోపురాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆలయాన్ని అన్నమయ్య సందర్శించి అనేక సంకీర్తనలు రచించారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతనామాత్యులు ఆ గ్రంథాన్ని ఇక్కడే స్వామివారికి అంకితమిచ్చారు. అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన రామభద్రకవి ఈ ప్రాంతానికి చెందినవాడేనని తెలుస్తోంది. ఆంధ్రవాల్మీకిగా ఖ్యాతిచెందిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట నివాసి కావడం విశేషం.
పున్నమి వెలుగుల్లో పురుషోత్తముని కల్యాణం
చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.
రాష్ట్ర ఉత్సవంగా బ్రహ్మోత్సవాలు
రాష్ట్ర విభజన అనంతరం కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పగించారు.
ఎలా చేరుకోవచ్చు
* కడప-తిరుపతి రహదారిపై వుంది. కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
* రైలులో రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యముంది.
* కడప రైల్వేస్టేషన్‌లో కూడా రైలు దిగి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యముంది.
* తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది.
Thanks by www.saisaranamyatra.com
Comments
Post a Comment